KTR: ఇంకో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం...! 10 h ago
TG : భాగ్యనగర ప్రతిష్ఠ పెంచడానికి, బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయం చేయడానికి రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే ముందు నందినగర్‌లోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలపడానికి రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానన్నారు. అవి చాలా వరకు ఫలించాయని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మా బావమరుదులకు రూ.1137 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని చేయలేదని తెలిపారు. మంత్రిగా ఉంటూ కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదని చెప్పారు. దానికి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనలేదన్నారు. ఆ తెలివితేటలు సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రివర్గ సహాచరులకే ఉన్నాయని పేర్కొన్నారు.
ఏ పని అయినా రాష్ట్రం కోసం, హైదరాబాద్ ప్రతిష్ఠ పెంచేందుకే చేశా అన్నారు. అరపైసా అవినీతి చేయలేదని వెల్లడించారు. చేయబోను అనిస్పష్టం చేశారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు నాపై బురద చల్లి పబ్బం గడుపుకొంటున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మేం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటాం అని మండిపడ్డారు. లగచర్లలో రైతులను జైల్లో పెట్టినా.. హైడ్రా పేరిట ఇళ్లు కూలగొట్టినా.. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోయినా అడుగడుగునా మేం నిలదీశామన్నారు. కేసులు పెట్టి ఆ అంశాలను పక్కదోవ పట్టిస్తున్నామనుకోవడం రేవంత్‌రెడ్డి వల్ల కాదు అని చెప్పారు. ఎన్నికల్లో మీరిచ్చిన 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది కాదు.. ఇంకో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటామని కేటీఆర్ పేర్కొన్నారు.